Anantapur District: మోదీ పాలనలో శ్రీమంతులదే రాజ్యం: రాహుల్ గాంధీ
- మోదీ పాలనలో రైతులు అప్పుల పాలు
- సామాన్యుడి బాధలు ఆయనకు పట్టవు
- మోదీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
మోదీ పాలనలో శ్రీమంతులదే రాజ్యమని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీలకే లబ్ధి చేకూర్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మోదీ పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, ప్రతిఒక్కరూ ఇబ్బంది పడ్డారని, సామాన్యుడి బాధలు ఆయనకు పట్టవని దుమ్మెత్తి పోశారు. మోదీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దేశంలోని అనేక చిన్న చిన్న కంపెనీలు మూతపడ్డాయని విమర్శించారు.
ఈరోజున కోటీశ్వరులు మాత్రమే వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉందని, సామాన్యులు వ్యాపారం చేయాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. మోదీ పాలనలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను తెరిపిస్తామని వాటికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.