Telugudesam: ప్రచార షెడ్యూల్‌తో అధినేతల బిజీ...కడప, చిత్తూరు జిల్లాల్లో బాబు, నాలుగు జిల్లాల్లో జగన్
- పశ్చిమగోదావరిని చుట్టేయనున్న పవన్‌కల్యాణ్
- ఎన్నికలు సమీపిస్తుండడంతో స్పీడ్ పెంచిన నేతలు
- వీలైనన్ని ప్రాంతాలు చుట్టేస్తున్న వైనం
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముహూర్తానికి ఇంకా పది రోజులే సమయం ఉంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అధినాయకుల ప్రచారం బిజీ షెడ్యూల్‌తో నడుస్తోంది. కడప, చిత్తూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పలు సభల్లో ప్రసంగించాల్సి ఉండగా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా నాలుగు జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసుకున్నారు. పవన్‌కల్యాణ్ పశ్చిమగోదావరిని చుట్టేస్తున్నారు. కడపలోని కీలక నియోజకవర్గాలైన జమ్మలమడుగు, పులివెందుల సభల్లో బాబు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఒంటి గంట తర్వాత జమ్మలమడుగు చేరుకుని అక్కడి బాలికల జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.45 గంటలకు పులివెందుల రింగ్ రోడ్డుకు చేరుకుని అక్కడి సభలో మాట్లాడుతారు. అనంతరం చిత్తూరు జిల్లాకు ప్రయాణమవుతారు.
వైసీపీ అధినేత విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం 9.30 గంటకు ఎస్.కోటలో, 11.30 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తిలో, 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో, 3.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సభల్లో ప్రసంగిస్తారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలోనే నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆచంటలోని గోడవారి రామచంద్రరావు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో,11.30 గంటలకు తణుకులోని పాత బెల్లం మార్కెట్ వద్ద, మధ్యాహ్నం ఒంటి గంటకు నిడదవోలులోని గణేష్ చౌక్ వద్ద ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం 2.30 గంటలకు తాడేపల్లిగూడెం శేషమహల్ సర్కిల్ వద్ద రోడ్‌షో నిర్వహిస్తారు.