Narendra Modi: ట్విట్టర్ వేదికగా మోదీ, చంద్రబాబు విమర్శల శరసంధానం
- పరస్పరం విమర్శించుకుంటున్న నేతలు
- అవినీతిపైనే ఇద్దరి మాటల యుద్ధం
- ఆసక్తి రేపుతున్న ట్వీట్లు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య విమర్శల యుద్ధం పెరుగుతోంది. ఇద్దరూ ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు కురిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు నవ్యాంధ్రలో మోదీ పర్యటన నేపథ్యంలో ఇద్దరి నేతల ట్వీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారు అవినీతి, కుటుంబ రాజకీయాలు కోరుకోవడం లేదు. అందువల్ల అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇది నా పూర్తి విశ్వాసం’ అని ఉదయం మోదీ ట్వీట్ చేశారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘ఆర్థిక నేరస్థులతో అంటకాగుతూ అవినీతి గురించి మీరా మాట్లాడేది?’ అని ఎదురు ప్రశ్నించారు.
‘నల్లధనాన్ని విదేశాల నుంచి రప్పిస్తానని చెప్పి బ్యాంకులను దోచి విదేశాల్లో తలదాచుకున్న వారికి అభయమిస్తున్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తున్న మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా లేదూ?’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కుప్పకూలుస్తున్న మీ పాలనకు త్వరలోనే ముగింపు పలకాని ప్రజలు నిర్ణయించుకున్నారని చంద్రబాబు ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు.