Holidays: 12న సెలవు పెడితే నాలుగు రోజుల వరుస సెలవు!
- 11న పోలింగ్ కావడంతో సెలవు
13 రెండో శనివారం, 14 ఆదివారం
ఓటర్లు ఊరెళ్లిపోతారని అభ్యర్థుల్లో ఆందోళన
ఎన్నికల తేదీలు నగరాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 11వ తేదీన పోలింగ్ కాగా ప్రభుత్వం ఆరోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు శుక్రవారం, 12వ తేదీన సెలవు పెట్టుకుంటే, 13, 14 తేదీలు కలిపి వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ ఎండాకాలంలో నగర ప్రాంత ఉద్యోగ, వ్యాపార ఓటర్లు ఎటైనా టూర్ కు లేదా, సొంత గ్రామాలకు వెళ్లిపోతారేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే హైదరాబాద్ విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో నివాసం ఏర్పరచుకున్న ఓటర్లు, వరుస సెలవులతో ఊర్లకు ప్రయాణం అవుతారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇదే జరిగింది. డిసెంబర్ 7న పోలింగ్ కాగా, ఆ రోజు శుక్రవారం వచ్చింది. దీంతో మూడు రోజుల సెలవుల కోసం ఎంతో మంది బస్సులు, రైళ్లు ఎక్కేశారు. దీంతో తెలంగాణలో 73 శాతానికి పైగా పోలింగ్ జరుగగా, హైదరాబాద్ పరిధిలో 50 శాతం కూడా దాటలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే నగర ప్రాంత అభ్యర్థులు, ఓటేసిన తరువాత ఊర్లకు వెళ్లాలని తమ ప్రచారంలో చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.