A-Sat: నెల రోజుల క్రితం... అంతరిక్షంలో ఫెయిలయిన ఇండియా!
- గత వారంలో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం
- ఫిబ్రవరి 12న అదే తరహాలో మరో ఏ-శాట్ ప్రయోగం
- అది విఫలమైందన్న యూఎస్ శాస్త్రవేత్త అంకిత్ పాండా
గతవారంలో అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ మిసైల్ ను ఇండియా విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయులు సాధించిన విజయంగా అభివర్ణించారు కూడా. అయితే, ఈ ప్రయోగం జరగడానికి దాదాపు నెల రోజుల ముందు ఇదే తరహా ఆపరేషన్ ను చేపట్టిన శాస్త్రవేత్తలు విఫలం అయ్యారని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
'ది డిప్లొమాట్' మేగజైన్ కు ఆర్టికల్ రాసిన యూఎస్ శాస్త్రవేత్త అంకిత్ పాండా, ఫిబ్రవరి 12న ఈ పరీక్ష జరిగిందని, లో ఎర్త్ ఆర్బిట్ లోని ఓ శాటిలైట్ కు గురిపెట్టిన క్షిపణి 30 సెకన్ల పాటు మాత్రమే ప్రయాణించిందని, అది లక్ష్యాన్ని చేరలేకపోయిందని తెలిపారు. ఉపగ్రహ విధ్వంసక వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడం చాలా క్లిష్టతరమైన వ్యవహారంగా అభిప్రాయపడ్డ ఆయన, ఫిబ్రవరిలో భారత ఏ-శాట్ ఆపరేషన్ విఫలమైనట్టు అమెరికన్ పరిశీలకులు సైతం నిర్థారించినట్టు తెలిపారు. ఫిబ్రవరి 12న మిసైల్ ను ప్రయోగించిన తరువాత, అది యూఎస్ రాడార్లపై కనిపించిందని, నాడు దీన్ని కేవలం యాంటీ శాటిలైట్ వెపన్ పరీక్షగానే అమెరికా భావించిందని చెప్పారు.