Andhra Pradesh: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై మండిపడ్డ టీడీపీ నేత సీఎం రమేశ్!
- చంద్రబాబే ప్యాకేజీకి ఒప్పుకున్నారన్న జైట్లీ
- కేంద్ర మంత్రి వైఖరిని తప్పుపట్టిన టీడీపీ నేత
- హోదాలోని అన్ని ప్రయోజనాలను కేంద్రం ఇస్తామని చెప్పిందని గుర్తుచేసిన నేత
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని టీడీపీ నేత సీఎం రమేశ్ విమర్శించారు. చంద్రబాబే ప్యాకేజీకి ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేకహోదాను ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదనీ, హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలను ప్యాకేజీ కింద అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఐదేళ్లు గడిచినా ఏపీకి న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో చంద్రబాబు మాటలను వక్రీకరిస్తూ అరుణ్ జైట్లీ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారో అరుణ్ జైట్లీకి తెలియదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ను భర్తీ చేస్తామనీ, అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.