Telangana: మరింత వేడెక్కనున్న తెలంగాణ!

  • హీట్ వేవ్ జోన్ లో రాష్ట్రం
  • అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు
  • అంచనా వేసిన ఐఎండీ

సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణ రాష్ట్రం మరింతగా వేడెక్కనుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. తాజాగా, ఏప్రిల్ - జూన్ సీజన్ ఉష్ణోగ్రతలను అంచనా వేసిన భారత మెట్రోలాజికల్ విభాగం, హీట్ వేవ్ జోన్ లో తెలంగాణ ఉందని, ప్రతి ప్రాంతంలో 0.5 నుంచి 1 డిగ్రీ వరకూ అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేసింది.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదవుతాయని, హైదరాబాద్ నగరంలో 40 డిగ్రీల వరకూ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 43 డిగ్రీల వరకూ వేడిమి చేరుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. "ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వేడిమి సాధారణంతో పోలిస్తే, 3 నుంచి 4 డిగ్రీల వరకూ అధికంగా నమోదవుతోంది. ఈ నెల ఆసాంతం 2 డిగ్రీల వరకూ వేడిమి పెరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ ప్రజలు మరింత వేడిమిని చూస్తారు" అని ఆయన అన్నారు.
 
కాగా, రాష్ట్రంలో ఈ నెల 11న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమయానికి వేడి చాలా అధికంగా ఉంటుందని, గాలిలో తేమ శాతం పెరిగి ప్రజలు ఉక్కపోతను అనుభవించాల్సి వస్తుందని ఐఎండీ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, నిన్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా 26.3 డిగ్రీలకు పెరిగింది.

  • Loading...

More Telugu News