Andhra Pradesh: చింతమనేని అక్రమాలు ఒక్కొక్కటి వింటుంటే అతను అసలు మనిషేనా అనిపిస్తోంది?: వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
- చింతమనేని అక్రమాలకు చంద్రబాబే కారణం
- దెందులూరు ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలి
- ఎమ్మార్వోను కొట్టిన వ్యక్తికి చంద్రబాబు టికెట్ ఇవ్వడం దారుణం
దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని అక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ నేత వైఎస్ షర్మిల ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మరోసారి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 38 రౌడీషీట్ కేసులున్న చింతమనేనిని ఓడిస్తే, జగన్ అన్న అతనికి బుద్ధి వచ్చేట్లు చేస్తాడన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడారు.
ఇసుక క్వారీల వద్ద తనిఖీలకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన చింతమనేనికి మళ్లీ చంద్రబాబు టికెట్ ఇవ్వడం దారుణమని షర్మిల మండిపడ్డారు. చింతమనేని అక్రమాలు ఒక్కొక్కటీ వింటుంటే అతను అసలు మనిషేనా? అని అనుమానం వస్తోందని దుయ్యబట్టారు.
యథా రాజా తథా ప్రజా అన్నట్లు చంద్రబాబు అలా ఉన్నారు కాబట్టే ఆయన పార్టీ నేత చింతమనేని ఇలా రెచ్చిపోతున్నాడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లేరును రీసర్వే చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. అన్నికష్టాలు తీరాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని దెందులూరు ప్రజలను కోరారు.