YSRCP: గతంలో వైఎస్సార్, చంద్రబాబు మధ్య జరిగిన వాదోపవాదాలను గుర్తుచేసిన విజయమ్మ
- వైఎస్సార్ ఎప్పుడూ రైతుల పక్షమే
- రైతుల ఆత్మహత్యల పట్ల చలించిపోయారు
- మాడుగుల సభలో విజయమ్మ ప్రసంగం
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీడికాడ వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆమె ప్రసంగిస్తూ, అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య జరిగిన వాదోపవాదాలను గుర్తుచేశారు.
రైతులంటే వైఎస్సార్ కు ఎంతో ఆపేక్ష అని, చంద్రబాబుకు మాత్రం రైతుల ప్రాణాలంటే ఏమాత్రం పట్టదని విమర్శించారు. వైఎస్సార్ 1978 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నా, ఆయన సీఎం అయింది మాత్రం 2004లో అని చెప్పారు. ఆ ఎన్నికలకు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు పాలనలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే తట్టుకోలేకపోయిన వైఎస్సార్ నిలదీశారని వెల్లడించారు.
"ప్రతి రైతుకు లక్ష చొప్పున తక్షణమే రుణమాఫీ చేయాలని వైఎస్సార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు అందుకు బదులిస్తూ, రైతులకు లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తే అదే అలవాటుగా మారిపోతుందని, అప్పుడు మరికొంత మంది ఆత్మహత్య చేసుకుంటారని కాస్త వ్యంగ్య ధోరణిలో చెప్పారు.
ఆ మాటకు వైఎస్సార్ మండిపడ్డారు. నీకు కోటి రూపాయలు ఇస్తా, నువ్ ఆత్మహత్య చేసుకుంటావా చంద్రబాబూ? రైతుల ప్రాణాలు పోతున్నా పరిస్థితి అర్థం కావడంలేదా? అంటూ బాగా కోప్పడ్డారు. అందుకే తను ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపైనే పెట్టారు" అంటూ ఆనాటి ఘటనను ప్రజలకు వివరించారు. ఆ సమయంలో విద్యుత్ బకాయిలు మాఫీ చేశారని కూడా విజయమ్మ తెలిపారు.