iPL: వరుస విజయాల చెన్నైకు బ్రేక్.. ముంబైని గెలిపించిన బౌలర్లు!

  • ఈ సీజన్‌లో చెన్నైకి తొలి ఓటమి
  • బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
  • చెన్నైని కాపాడలేకపోయిన జాదవ్ అర్ధ సెంచరీ

ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ధోనీ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ముంబై బ్రేకులు వేసింది. బౌలర్లు లసిత్ మలింగ, హార్దిక్ పాండ్యా, బెహ్రెండార్ఫ్ ‌లు తమ బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించారు.

ముంబైలోని వాంఖడేలో  జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ తొలుత టపటపా వికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో మునిగినట్టు కనిపించింది. అయితే, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యాలు రాణించడంతో జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. 43 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 8 ఫోర్లు, సిక్సర్‌తో 59 పరుగులు చేయగా, 32 బంతులు ఆడిన కృనాల్ పాండ్యా 5 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ మెరుపులు మెరిపించారు. 8 బంతులు మాత్రమే ఆడిన పాండ్యా ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేయగా, 7 బంతులు ఆడిన పొలార్డ్ 2 సిక్సర్లతో 17 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

అనంతరం 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. మలింగ, హార్దిక్ పాండ్యా, జాసన్ బెహ్రెండార్ఫ్‌లు చెలరేగి వికెట్లు తీశారు. మలింగ, పాండ్యా మూడేసి వికెట్ల చొప్పున పడగొట్టగా, బెహ్రెండార్ఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కేదార్ జాదవ్(58) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇటు బంతితోను, అటు బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ముంబై ఖాతాలో రెండో విజయం నమోదైంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇదే తొలి ఓటమి.

  • Loading...

More Telugu News