Madhavilatha: నన్ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా: సినీ నటి మాధవీలత
- మహిళలకు అండగా నిలుస్తా
- నా గెలుపు ఖాయమే
- గుంటూరు పశ్చిమ బీజేపీ అభ్యర్థి మాధవీలత
రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటానని, మహిళలకు అండగా ఉంటానని సినీ నటి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలత వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమెకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ప్రచారం నిమిత్తం తాను ఎక్కడికి వెళ్లినా, వాళ్లింటి అమ్మాయిగానే భావిస్తున్నారని, తన గెలుపు ఖాయమని అన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయని, డ్రైనేజీ, మంచినీరు, పెన్షన్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సినీ నటులంతా వైసీపీలో చేరుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రాంతీయ పార్టీని ఎంచుకుంటే ఓ ప్రాంతానికే పరిమితం అవుతామని, జాతీయ పార్టీ అయితే దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించవచ్చన్న ఆలోచనతోనే తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీల్లో తనకు నైతిక విలువలు కనిపించలేదని అన్నారు. తనను గెలిపిస్తే ప్రజా సేవ చేసుకుంటానని, ఓడిపోతే, బీజేపీ నిర్ణయం ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని అన్నారు.