IPL: మేము ఓడిపోవడానికి కారణమిదే: ధోనీ సంచలన వ్యాఖ్యలు
- నిన్న ముంబై చేతిలో ఓడిపోయిన చెన్నై
- బౌలర్లు పూర్తిగా విఫలం అయ్యారు
- కొన్ని క్యాచ్ లను వదిలేశాం
- తదుపరి మ్యాచ్ లలో ఆటగాళ్లు మారుతారన్న ధోనీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా గత రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ లో పరాజయం కావడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ స్పందించారు. 37 పరుగుల తేడాతో ఓడిపోయిన తరువాత మీడియాతో మాట్లాడిన ధోనీ, తొలి 12 ఓవర్ల పాటు తాము చాలా బాగా ఆడామని, ఆ తరువాత మాత్రం బౌలర్లు పూర్తిగా విఫలమైపోయారని అన్నారు. కొన్ని క్యాచ్ లను ఆటగాళ్లు వదిలేశారని, మిస్ ఫీల్డింగ్, బౌలింగ్ లోపల వల్లే తాము ఓడిపోయామని, ముంబై ఆటగాళ్లను అదుపు చేయడంలో బౌలర్లు విఫలం అయ్యారని అన్నారు.
డెత్ ఓవర్లలో తాను అనుకున్నదానికన్నా బౌలర్లు ఎన్నో పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నారని వ్యాఖ్యానించిన ధోనీ, మరోసారి ఇటువంటి ఫలితం రాకుండా ఒక్కో ఆటగాడితో తాను విడివిడిగా చర్చిస్తానని అన్నారు. గాయాల కారణంగా జట్టుకు ప్రధాన ఆటగాళ్లు దూరం అయ్యారని, బ్రావోను గాయం వేధిస్తోందని, డేవిడ్ విల్లీ లేని కొరత కనిపిస్తోందని అన్నారు.
తదుపరి మ్యాచ్ లలో కాంబినేషన్లను మార్చి చూస్తామని, కొందరిని తొలగించి, రిజర్వ్ బెంచ్ లో ఉన్న మరికొందరికి అవకాశం కల్పిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్ లో చివరి రెండు మూడు ఓవర్లలో చెన్నై బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో, ఆ స్కోరును సూపర్ కింగ్స్ చేరుకోలేక పోయిన సంగతి తెలిసిందే.