Chandrababu: మీరు అలా అనుకుంటే జగన్ కే ఓటు వేయండి: చంద్రబాబునాయుడు
- సొంత ఇంట్లోనే అద్దె ఇవ్వాలని అనుకుంటారా?
- వైసీపీకి ఓటేస్తే అదే పరిస్థితి వస్తుంది
- ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెడుతున్నారు
- టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు
ఎవరి సొంత ఇంట్లో అయినా, వారే అద్దెకు ఉండాలని భావిస్తే వైసీపీకి ఓటు వేయాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జగన్ కు, ఆయన నిలిపిన అభ్యర్థులకు ఓటు వేస్తే, ఉన్న సొంతింటికి అద్దె చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని, రాష్ట్రం అరాచకమై పోతుందని హెచ్చరించారు.
ఈ ఉదయం నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంపై దుష్ట చతుష్టయం కుట్రలు చేస్తోందని, పోరాడేందుకు, అభివృద్ధిని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగానూ కేంద్రం ఇబ్బంది పెడుతోందని, కోర్టులో ఎన్నడో కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి, అరెస్ట్ వారెంట్ ను జారీ చేయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వైకాపా నేతలు పోలీసులపైనే దాడులకు దిగుతున్నారని, ఓడిపోతామన్న భయం వారిని వెంటాడుతోందని, ప్రజలు మాత్రం టీడీపీకి అండగా ఉన్నారని అన్నారు. పోలీసులపై చెప్పులు, రాళ్లు వేశారని, స్కూలు పిల్లలపైనా వారు దాష్టీకాలకు దిగుతున్నారని, వైసీపీ నేతలు తమ ఇళ్లలో అద్దెకుండే టీడీపీ సానుభూతిపరులను కూడా వదలడం లేదని, గర్భిణీలని, వృద్ధులని కూడా చూడటం లేదని మండిపడ్డారు.
వీరి ఆగడాలకు చరమగీతం పాడే అధికారం ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేయడం ద్వారా నేరస్థులకు అధికారం దక్కకుండా చూడాలని కోరారు. ఐటీ దాడులు కేవలం టీడీపీ నాయకులపైనే జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, వైసీపీ నేతలపై ఎందుకు దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీద మస్తాన్ రావు, పుట్టా సుధాకర్ యాదవ్ లపై దాడులు చేస్తున్నారని, వైసీపీకి చెందిన ఒక్క నేత, వ్యాపారిపైనా ఐటీ దాడులు ఎందుకు జరగలేదని నిలదీశారు.