Andhra Pradesh: టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులను ఖండిస్తూ సీఈఓకు వినతి పత్రం.. నోటీసులు జారీ చేసిన ద్వివేది
- కనకమేడల ఆధ్వర్యంలో సీఈవోను కలిసిన నేతలు
- ఉద్దేశపూర్వకంగా ఐటీ దాడులు జరిపారు
- ఈ దాడులు చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే
ఏపీ టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులను ఖండిస్తూ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) ద్వివేదికి టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఎంపీ కనకమేడల రవీంద్ర ఆధ్వర్యంలో సీఈవోను ఈరోజు కలిశారు. ముగ్గురు టీడీపీ అభ్యర్థులపై ఉద్దేశపూర్వకంగా ఐటీ దాడులు జరిపారని ఆ వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించిన తర్వాత ఐటీ దాడులు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని కనకమేడల పేర్కొన్నారు.
ఐటీ అధికారులకు నోటీసులు పంపుతాం: ద్వివేది
టీడీపీ ప్రతినిధుల ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం, ఐటీ అధికారులను ఫోన్ లో వివరణ కోరారు. ఐటీ అధికారులకు నోటీసులు పంపుతామని సీఈఓ ద్వివేది పేర్కొన్నట్టు సమాచారం. ఐటీ దాడులపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈ మేరకు ద్వివేది ఆదేశించారు.
కోవెలమూడి వ్యాపార సంస్థలపై మళ్లీ ఐటీ దాడులు
ఏపీ టీడీపీ నేత కోవెలమూడి రవీంద్రకు చెందిన వ్యాపార సంస్థలపై మరోసారి ఐటీ దాడులు జరిగాయి. కోవెలమూడి వ్యాపార సంస్థల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం ‘కోవెలమూడి’పై ఐటీ అధికారులు దాడులు జరిపారు.