Pawan Kalyan: నా ముందు కేసీఆర్ ను తిట్టినవాళ్లందరూ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు: పవన్ కల్యాణ్
- వాళ్లంతా ప్రజల నేతలు కాదు
- స్వార్థంతోనే పనిచేస్తారు
- హైదరాబాద్ యుద్ధభేరిలో పవన్ వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన యుద్ధభేరి సభలో మాట్లాడుతూ, కేసీఆర్ పై నొప్పింపక తానొవ్వక రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఓ ఉద్యమనాయకుడిగా కేసీఆర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, ఆంధ్ర ప్రజల కోసం చంద్రబాబుతో విభేదాలను కేసీఆర్ పక్కన పెట్టాలని హితవు పలికారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య గొడవలతో ఏపీ ప్రజలు నలిగిపోయారని, ఇంకా వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. తాను కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ఈ వ్యాఖ్యలు చేయడంలేదని పవన్ స్పష్టం చేశారు.
గతంలో తనముందు కేసీఆర్ ను నోటికొచ్చినట్టు తిట్టిన నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు ఒకప్పుడు కేసీఆర్ ను నానామాటలు అన్నవారేనని వివరించారు. ఇలాంటి వాళ్లంతా ప్రజల కోసం పనిచేసే వాళ్లు కాదని, తమ స్వంత ప్రయోజనాల కోసం పనిచేసే నేతలని అన్నారు. తెలంగాణ రాగానే సీఎంగా ఓ దళితుడ్ని తీసుకువస్తామని కేసీఆర్ చెప్పినా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆ కోరిక నెరవేరలేదని పవన్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన గురించి తాను తప్పుగా మాట్లాడడం లేదని, కానీ, ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా? అని అడిగారు.