Governor: వివాదాస్పద వ్యాఖ్యల గవర్నర్ కల్యాణ్ సింగ్‌పై వేటు?
- బీజేపీ గెలిచి మోదీ మళ్లీ ప్రధాని కావాలన్న గవర్నర్
- తాను బీజేపీ కార్యకర్తనని వ్యాఖ్య
- చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోరిన రాష్ట్రపతి
త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోదీ మరోమారు ప్రధాని కావాలని, తాను బీజేపీ సైనికుడినంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్‌పై వేటు పడేలా కనిపిస్తోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కల్యాణ్ సింగ్ వేటుకు ముందే రాజీనామా చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కల్యాణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కేంద్రాన్ని కోరారు. ఆయన తీరును అభిశంసిస్తూ ఎన్నికల కమిషన్ పంపిన నివేదికను గురువారం కోవింద్ హోంశాఖకు పంపారు.
ఇటీవల అలీగఢ్‌లో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. అందరం బీజేపీ కార్యకర్తలమేనని, మళ్లీ బీజేపీ గెలవాలని, మోదీ మళ్లీ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. గవర్నర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కల్యాణ్ సింగ్ గవర్నర్ పదవి ఔన్నత్యాన్ని దిగజార్చారని, సామాన్య బీజేపీ కార్యకర్తలా మాట్లాడారని ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. ఆయన రాజ్యాంగ పదవిలో ఉండడంతో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి కోవింద్‌కు నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో కల్యాణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోవింద్ కేంద్రాన్ని కోరారు.