Lalu prasad yadav: నితీశ్ కుమార్ ‘మహాకూటమి’లోకి వస్తానన్నారు.. నేను కుదరదన్నా: లాలుప్రసాద్ యాదవ్
- త్వరలోనే విడుదల కానున్న లాలు బయోగ్రఫీ
- ‘గోపాల్‌గంజ్ టు రైసినా: మై పొలిటికల్ జర్నీ’ పుస్తకంలో లాలూ వ్యాఖ్యలు
- ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన జేడీయూ
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ ‘మహాకూటమి’లోకి వస్తామని అడిగారని, కానీ తాను కుదరదని చెప్పేశానని పేర్కొన్నారు. తమను విడిచి బీజేపీతో వెళ్లిన ఆరు నెలలకే ఆయనీ ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు. నితీశ్ కుమార్ పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారని, మహాకూటమిలో చోటు లేదని చెప్పేశానని వివరించారు.
త్వరలోనే విడుదల కానున్న ఆయన బయోగ్రఫీ ‘గోపాల్‌గంజ్ టు రైసినా: మై పొలిటికల్ జర్నీ’లో లాలు ఈ వ్యాఖ్యలు చేశారు. జేడీయూ ఉపాధ్యక్షుడు, విశ్వాసపాత్రుడు అయిన ప్రశాంత్ కిశోర్‌ను వివిధ సందర్భాల్లో ఐదుసార్లు తనవద్దకు పంపి ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు లాలు తెలిపారు. నితీశ్ అంటే తనకు కోపం లేదని, కాకపోతే ఆయన తన విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని పేర్కొన్నారు. పుస్తకంలో లాలు చేసిన వ్యాఖ్యలను జేడీయూ సెక్రటరీ జనరల్ కేసీ త్యాగి కొట్టిపడేశారు. మహా కూటమిలోకి తిరిగి వెళ్లాలని నితీశ్ ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తనకు తప్పకుండా తెలిసి ఉండేదన్నారు.