Pawan Kalyan: మోదీ, చంద్రబాబు నన్ను వాడుకుని వదిలేశారు: ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్
- బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి
- పొత్తు కావాలంటూ వైసీపీ కూడా అడిగింది
- మాయావతికి ప్రధాని అయ్యే చాన్స్ ఉందన్న పవన్
2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలు తనను కరివేపాకులా వాడుకుని పక్కన బెట్టాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, "వారి విజయానికి నన్ను ముడి పదార్థంలా వాడుకున్నారు. నన్ను ఎదగనివ్వాలని వారు అనుకోలేదు. ఇక వారి కోసం నేనెందుకు పని చేయాలి. ఎన్నికల్లో విజయం తరువాత నరేంద్ర మోదీని, బీజేపీ నేతలను కలిశాను. వారితో మాట్లాడిన తరువాత నా అవసరం వారికి లేదనిపించింది. ఎవరూ ఈ మాట నాతో అనలేదుగానీ, అక్కడి పరిస్థితి మాత్రం అదే" అని పవన్ వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలు పవన్ కల్యాణ్ మద్దతు తీసుకుని ఎన్నికల బరిలోకి దిగగా, ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 5 లక్షల ఓట్లను అదనంగా పొంది, అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లోనూ తమకు మద్దతివ్వాలని బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తనను కోరాయని, అయినా, తాను మాత్రం వారికి వ్యతిరేకంగా వెళ్లాలని భావించానని చెప్పుకొచ్చారు. దళిత శక్తిగా ఉన్న మాయావతితో ఈ దఫా పొత్తు పెట్టుకున్నామని, లెఫ్ట్ పార్టీలూ తమతో కలిసివచ్చాయని, మాయావతికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.