Andhra Pradesh: ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం!
- మొత్తం 73,603 టికెట్లు విడుదల చేసిన టీటీడీ
- లాటరీ విధానంలో మరో 10,753 టికెట్లు విడుదల
- సహస్ర దీపాలంకరణకు మరో 17,400 టికెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను ఈరోజు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి 73,603 టికెట్లను ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,753 సేవా టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ తెలిపింది.
సుప్రభాతం కింద 7953, తోమాల కింద 130, అర్చన సేవల కింద మరో 130 సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అష్టదళ పాదపద్మారాధనకు 240, నిజపాద దర్శనం సేవకు 2300 టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
కరెంట్ బుకింగ్ కింద 62,850 ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ తెలిపింది. విశేష పూజ కింద 2500, కల్యాణోత్సవం కింద 14,250 సేవా టికెట్లను విడుదల చేశామంది. ఊంజల్ సేవ కింద 4,500 టికెట్లు, ఆర్జిత బ్రహ్మోత్సవం కింద 8250 టికెట్లు, వసంతోత్సవం కింద 15,950 టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. సహస్ర దీపాలంకరణకు 17,400 టికెట్లు జారీచేశామని టీటీడీ తెలిపింది.