Bollywood: ఆ నిర్మాత ‘ఛాన్స్ ఇస్తా.. నాతో సన్నిహితంగా ఉంటావా’ అని అడిగాడు!: హీరోయిన్ శ్రుతి మరాఠే
- మొదట ప్రొఫెషనల్ గానే మాట్లాడాడు
- హీరోను కూడా అడిగావా? అని ప్రశ్నించా
- ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేజీలో పోస్ట్ చేసిన నటి
దక్షిణాది సినీపరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు తాను క్యాస్టింగ్ కౌచ్(లైంగిక వేధింపులను) ఎదుర్కొన్నట్లు మరాఠి నటి శ్రుతి మరాఠే తెలిపారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘‘ఓసారి సినిమాలో అవకాశం ఇస్తానని ఓ దక్షిణాది నిర్మాత నన్ను కలిశాడు. మొదట్లో ప్రొఫెషనల్‌గానే మాట్లాడాడు. ఆ తర్వాత నాతో సన్నిహితంగా ఉంటావా? అని తన అసలు స్వరూపం బయటపెట్టాడు. అప్పుడు నేను ‘మరి హీరోను కూడా ఇదే మాట అడిగావా?’ అని అడిగేశాను. నా ప్రశ్న విని అతడు షాకయ్యాడు. ఆ రోజు భయంలేకుండా అతడిని నిలదీయడానికి నాకు ఒక నిమిషమే పట్టింది. నాకోసం నేను నిలబడలేదు. ప్రతీ ఆడపిల్లను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రశ్న అడిగాను. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని తెలియజేయవు. నా ప్రతిభ, కష్టపడే తత్వం, నా విజయం మాత్రమే నేనేంటో చెబుతాయి’ అని తెలిపారు.
తాను 16 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి వచ్చానని శ్రుతి తెలిపారు. ‘నటీనటుల జీవితాలు చాలా హాయిగా సాగిపోతుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నా కెరీర్ తొలినాళ్లలో ఓ దక్షిణాది సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమా కోసం దర్శకుడు బికినీ వేసుకోవాలన్నాడు. ఎందుకు? ఏమిటి? లాంటి ప్రశ్నలు వేయకుండా సినిమా కోసం ఒప్పుకొన్నా. కొన్నేళ్ల తర్వాత మరాఠీ షోలతో నాకు బాగా పాప్యులారిటీ వచ్చింది. కానీ ఆ సన్నివేశం చూసిన కొందరు నన్ను ఎగతాళి చేశారు’ అని గుర్తుచేసుకున్నారు. అలాంటి విమర్శలు నటీనటుల ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. ‘బుధియా సింగ్: బోర్న్ టు రన్’ చిత్రంతో శ్రుతి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.