Tamil Nadu: తమిళనాడులో.. ఎన్నికల అధికారులకు పట్టుబడ్డ 146 కేజీల బంగారం
- వాహనాల తనిఖీ సందర్భంగా భారీగా పట్టుబడిన గోల్డ్
- వ్యాన్లో తరలిస్తుండగా గుర్తించిన అధికారులు
- సరైన ఆధారాల్లేవని గుర్తించి స్వాధీనం
ఎన్నికల వేళ దొంగచాటుగా పెద్దమొత్తంలో నగదు తరలించడం, ఇటువంటి నోట్లకట్టలు అప్పుడప్పుడూ అధికారులకు చిక్కడం సర్వసాధారణం. కానీ తమిళనాడులో ఓ వ్యాన్ నుంచి పెద్ద ఎత్తున బంగారం కడ్డీలు చిక్కడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో ఎన్నికల అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వ్యాన్ని నిలువరించి సోదాలు చేయగా పెద్దమొత్తంలో బంగారం కడ్డీలు ఉన్నట్టు గుర్తించారు. బయటకు తీస్తే ఏకంగా 146 కిలోల బంగారం ఉండడంతో ఆశ్చర్యపోయారు. వ్యాన్ సిబ్బందిని ప్రశ్నించగా ఓ ప్రముఖ బంగారం దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకువెళ్తున్నామని వారు చెప్పినా, అందుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో నగలను, వ్యాన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమయింది.