Andhra Pradesh: తొలుత దుర్గమ్మ దర్శనం.. అనంతరం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
- ఈరోజు ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
- సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉగాది నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సుబ్రహ్మణ్యం.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ సీఎస్ కు దుర్గమ్మ చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సుబ్రహ్మణ్యం సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అన్నిరకాలుగా సంతోషంగా ఉండేలా పనిచేస్తానని తెలిపారు.
ఏపీ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎస్ పునేఠా వ్యవహారశైలిపై వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆయన్ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఈసీ నియమించింది.