Andhra Pradesh: ఏపీ యువత జగన్ లా సూట్ కేసు కంపెనీలు, బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టలేదు: దేవినేని ఉమ మండిపాటు
- కేసీఆర్ కనుసన్నల్లోనే జగన్ మేనిఫెస్టో విడుదల
- పోలవరంను అడ్డుకునేందుకు కేసీఆర్ తో కలిసి కుట్రలు
- అమరావతిలో మీడియాతో ఏపీ మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేసీఆర్, జగన్ కుట్రలు చేసి పోలవరంపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమ్మతితో పోలవరం చేపడుతున్నామనీ, దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కేంద్రం చూసుకుంటుందని పార్లమెంటులో చట్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.
అమరావతిలో రూ.50,000 కోట్ల పనులు జరుగుతుంటే, అమరావతిని జగన్ భ్రమరావతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల పట్ల అవహేళనగా మాట్లాడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఏపీలో 62 ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తుంటే కనీసం జగన్ కు పట్టడం లేదని దుయ్యబట్టారు. పులివెందులకు నీళ్లు అందించినా జగన్ కు కృతజ్ఞత లేదన్నారు. ఏపీలో కుల ఘర్షణలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఏపీలో సామంతుడిని గెలిపించడానికి కేసీఆర్, కేటీఆర్ గొడవలు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.
అందులో భాగంగానే మైలవరంలో కేంద్ర సాయుధ బలగాలపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏ తప్పు జరిగి ఉన్నా తనను బాధ్యుడిని చేసేవారన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే వైసీపీ చేసిన పాపాలన్నీ బయటపడ్డాయని అన్నారు. పోలవరం, అమరావతి గురించి కనీసం మేనిఫెస్టోలో ప్రస్తావించని జగన్ ను రైతులు, ఏపీ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
జగన్ లా ఏపీ యువత సూట్ కేసు కంపెనీలు, బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టలేదనీ, కష్టపడి దేశవిదేశాల్లో సంపాదిస్తున్నారని చెప్పారు. సత్య నాదెళ్ల వంటి వ్యక్తులు అనంతపురం నుంచి వచ్చి ఉన్నతస్థానానికి ఎదిగారని గుర్తుచేశారు. వేలాది మంది ఏపీ యువత దేశవిదేశాల్లో స్థిరపడ్డారని చెప్పారు. ఆంధ్రులకు నిబద్ధత లేదని విజయసాయిరెడ్డి చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు.