Andhra Pradesh: నాకు, జగన్ కు ఏమైనా పోలిక ఉందా?: సీఎం చంద్రబాబునాయుడు
- ఒక నేరస్తుడితో పోరాడాలంటే నాకు బాధగా ఉంది
- జగన్ నన్ను నానామాటలన్నాడు
- ఈ ఎన్నికల్లో ‘కోడికత్తి పార్టీ’ని ఓడించాలి
‘నాకు, జగన్ కు ఏమైనా పోలిక ఉందా?’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఒక నేరస్తుడితో పోరాడాలంటే తనకు బాధగా ఉందని, తనను నానామాటలన్న జగన్, కేసీఆర్ తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల్లో ‘కోడికత్తి పార్టీ’ని ఓడించాలని, ఈ పార్టీకి చెందిన చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని విమర్శించారు.తెలంగాణ ముందు తలదించుకునే పరిస్థితి రానీయొద్దని ప్రజలకు సూచించారు. విభజన సమయంలో ఏపీకి రావాల్సిన రూ.లక్ష కోట్లు ఎగ్గొట్టారని, ఏపీ ప్రజలను కేసీఆర్ దూషించారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
భద్రాచలంను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని, ‘మా భద్రాచలం మాకు ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. అమరావతిని ఆదర్శ నగరంగా నిర్మిస్తామని మరోసారి హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు, రాజధానిపై జగన్ పార్టీ మేనిఫెస్టోలో ఒక్క హామీ ఇవ్వలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అసలు నీటి కొరతే ఉండదని అన్నారు.