Purandeswari: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సలహాదారుగా ఉండడానికి నేను రెడీ, కానీ...!: పురందేశ్వరి
- ఎన్టీఆరే స్వయంగా అడగాలి
- ఉచిత సలహాలు ఇవ్వను
- లక్ష్మీపార్వతిపై ఎప్పుడూ చేయి చేసుకోలేదు
బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తాజా పరిస్థితులపై స్పందించారు. విశాఖపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పురందేశ్వరి తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, అతనికి సినిమాల్లో మంచి భవిష్యత్ ఉందని, ఇప్పట్లో రాజకీయాల్లోకి రాకపోవచ్చని అన్నారు. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటే అతనికి సలహాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పురందేశ్వరి స్పష్టం చేశారు.
తనకు సలహాదారుగా ఉండమని ఎన్టీఆర్ స్వయంగా అడగాలని, అంతే తప్ప ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయనని పేర్కొన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని గతంలో చాలాసార్లు చెప్పాడని, అందుకే తారక్ రాజకీయ జీవితం గురించి ఇప్పుడే చర్చించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు చెప్పారు.
అంతేగాకుండా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్పందిస్తూ, ఆ సినిమా తాను చూడలేదని వెల్లడించారు. తాను లక్ష్మీపార్వతిని కొట్టినట్టుగా ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజలు సంచలనం కోరుకుంటారు కాబట్టే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఆసక్తి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.