local pols: లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాత తెలంగాణలో ‘స్థానిక’ సంస్థల ఎన్నికలు
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ
- ఈసీ గ్రీన్‌సిగ్నల్
- ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసేలోగా స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి రాసిన లేఖపై ఈసీ స్పందించింది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఈరోజు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో మొత్తం ప్రక్రియ మే 23 తర్వాత ముగియనుంది. దీంతో అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ కారణంగా ఈ కోడ్ కాలం ముగిసేలోగా స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించుకునే అవకాశం కల్పించాలని మార్చి 13, 22 తేదీల్లో రెండుసార్లు తెలంగాణ సర్కారు లేఖలు రాసింది.
దీనికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లోక్‌సభ ఎన్నికలకు సిబ్బంది కొరత లేకుండా చూసుకుని ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. ఫలితాలు మాత్రం ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రకటించరాదని ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేలా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు.