Telangana: కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి!

  • ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారు
  • కుంటి సాకులతో మా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు
  • పార్టీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారు

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నప్పటికీ కుంటిసాకులు చెబుతూ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి దిగొద్దని మద్దతుదారులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు బహిరంగ లేఖ రాశారు.

టీఆర్ఎస్ లో చేరాలని కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని లేఖలో రేవంత్ రెడ్డి తెలిపారు. తమ మాట వినకపోతే అక్రమ కేసులు పెడతామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు రాత్రి 10 గంటల వరకూ అనుమతి ఉన్నప్పటికీ సాయంత్రం 7 గంటలకే ప్రచారం ముగించాలని ఒత్తిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా బెదిరిస్తున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

  • Loading...

More Telugu News