Andhra Pradesh: చంద్రబాబు అక్కుపక్షి అయితే జగన్ జటాయువు.. వైసీపీకి 130 సీట్లు పక్కా!: మోహన్ బాబు
- ఏపీ సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు
- దానిని లోకేశ్ అకౌంట్లో వేసుకుని నికృష్టంగా వ్యవహరిస్తున్నారు
- జగన్ మేనిఫెస్టోను అమలుచేస్తాడని నేను హామీ ఇస్తున్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని వైసీపీ నేత, సినీనటుడు మోహన్ బాబు విమర్శించారు. టీడీపీ త్వరలోనే కనుమరుగు అయిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజల సొమ్మును దోచుకున్నారనీ, దాన్ని తన కొడుకు లోకేశ్ అకౌంట్ లో వేసుకుని నికృష్టంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత చెవిరెడ్డి తరఫున మోహన్ బాబు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను 9 జిల్లాల్లో ఇప్పటివరకూ పర్యటించానని తెలిపారు. ఈసారి వైసీపీకి 130 సీట్లు వస్తాయన్న విషయం అర్థమయిందన్నారు.
ఏపీకి కాబోయే సీఎం జగనేనని పునరుద్ఘాటించారు. జగన్ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అనీ, ఫ్యాన్ గుర్తుకు ఈసారి ఓటేసి చెవిరెడ్డిని గెలిపించాలని చంద్రగిరి ప్రజలను కోరారు.
‘చంద్రబాబు రోజుకో పార్టీతో సంసారం చేస్తారు. వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి రాత్రి రాత్రే తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు. ఆయనో అక్కుపక్షి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇందుకు పూర్తి భిన్నం. ఆయన జటాయువు లాంటివారు. తాను ప్రకటించిన మేనిఫెస్టోను వైఎస్ జగన్ తప్పకుండా అమలు చేస్తారు. అందుకు నేను హామీ ఇస్తున్నా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.