Hyderabad: త్వరలోనే ఎల్బీనగర్ లో రిజిస్ట్రేషన్ల సమస్య తీరుతుంది: కేటీఆర్
- ఎల్బీనగర్ లో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
- రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేశాం
- శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి
ఈ ఐదేళ్లలో అనుకున్న దానికంటే ఎక్కువగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక కేబీఆర్ గార్డెన్ లో ఎల్బీనగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్సీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎల్బీనగర్ లో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు నాణ్యమైన ప్రజా రవాణాను అందిస్తున్నామని, త్వరలోనే ఎల్బీనగర్ లో రిజిస్ట్రేషన్ల సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ సరఫరా సరిగాలేక పరిశ్రమలు మూతపడే పరిస్థితులు ఉండేవని, గతంలో విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలకు పవర్ హాలిడే లు ఉండవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, 24 గంటల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని ప్రశంసించారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకొస్తాయని, రాజకీయ సుస్థిరత వల్ల పరిశ్రమలు రాష్ట్రం వైపు మొగ్గుచూపుతాయని చెప్పారు. తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని దేశంలోని 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అన్నారు.