Polavaram: ‘పోలవరం’పై కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది: కేవీపీ
- ‘పోలవరం’పై కేవీపీ దాఖలు చేసిన పిల్ పై విచారణ
- కౌంటర్ దాఖలు చేయని కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు
- ఉదాసీన వైఖరి తగదన్న డివిజన్ బెంచ్
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు భారం ఏపీపై పడకుండా కేంద్రమే భరించి, త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత నెల 25న ఈ కేసు విచారణ జరిపిన హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయమని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపు న్యాయవాదులు ఈరోజు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. ఇంకా రెండు వారాల సమయం కావాలని కోరడంపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి ముఖ్యమైన కేసులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి తగదని అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం మాత్రమే ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని కేవీపీ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఈరోజుకు కూడా కౌంటర్ ఫైల్ దాఖలు చేయకుండా మళ్లీ సమయం కోరడం, పోలవరం పట్ల రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ కు వరప్రదాయని అయిన పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని, ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టమో, శాపమో తెలియదు గాని, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వారంతా తీవ్రంగా గర్హించదగిన విషయమని కేవీపీ పేర్కొన్నారు.