Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం బావమరిది ఇంట్లో రూ. 281 కోట్లు... లారీలో పట్టుకెళ్లిన అధికారులు!
- కమల్ నాథ్ బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు
- కంప్యూటర్లు, కీలక పత్రాలు కూడా స్వాధీనం
- కుట్ర పూరిత దాడులన్న కమల్ నాథ్
ఒకటి, రెండు కాదు... ఏకంగా 281 కోట్ల రూపాయలు... గోనె సంచుల్లో, అట్టపెట్టెల్లో దాచిన డబ్బు. ఈ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కూడబెట్టిన డబ్బు. అది కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బావమరిది ఇంట్లో. సోమవారం నాడు కమల్ నాథ్ బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, లెక్కల్లో చూపని ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంత డబ్బు ఒకే చోట ఉండటం చూసి అవాక్కైన అధికారులు, స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని తరలించేందుకు లారీని రప్పించడం గమనార్హం. ఇదే సమయంలో కమల్ నాథ్ మరో సన్నిహితుడి ఇంట్లో రూ. 14.6 కోట్ల రూపాయలను సీజ్ చేశామని, కంప్యూటర్లు, కొన్ని కీలక పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్, ఢిల్లీ మధ్య చాలా నగదు బట్వాడా జరిగినట్టు గుర్తించామన్నారు. ఈ విషయంలో కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక తాజా ఐటీ దాడులు, రాజకీయ కుట్ర పూరితమని, ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కైన బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని కమల్ నాథ్ ఆరోపించారు.