jagan: అక్కడ ఈయన ప్రచారం చేయరు... ఇక్కడ ఆయన ప్రచారం చేయరు: చంద్రబాబు, పవన్ లపై మంగళగిరిలో జగన్ సెటైర్లు
- చంద్రబాబు, లోకేశ్ మంగళగిరిలో తిరిగిందే లేదు
- కుప్పం, మంగళగిరిలో పవన్ ప్రచారం చేయరు
- గాజువాక, భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరు
ఏపీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ పై ఆయన సెటైర్లు వేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఈ గడ్డపై లోకేశ్ ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక్కడ తిరిగింది లేనేలేదని చెప్పారు. తన పార్ట్ నర్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరని... చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వారి పార్ట్ నర్ ప్రచారం చేయరని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో భయపడి హైదరాబాదు నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని జగన్ అన్నారు. ఏపీలో తాను సొంత ఇల్లు కట్టుకున్నానని... చంద్రబాబు అద్దె ఇంట్లో ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైయస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, రైతులకు ఉచితంగా పంట బీమా కల్పిస్తామని చెప్పారు.
ఎన్ని లక్షల ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం ఏటా రూ. 20 వేలు అందిస్తామని చెప్పారు. ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.