Andhra Pradesh: ‘పసుపు-కుంకుమ’ నిధులకు బ్యాంకుల మోకాలడ్డు.. ఆందోళనకు దిగిన ఏపీ మహిళలు!
- గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఘటన
- మూడో విడత నగదును విడుదల చేసిన ప్రభుత్వం
- రోడ్డుపై బైఠాయించిన డ్వాక్రా సంఘాల సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు పసుపు-కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10,000 ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ఏపీ ప్రభుత్వం విడతలవారీగా విడుదల చేస్తోంది. అయితే ఈ నిధులను బ్యాంకులు ఇవ్వడకపోవడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో డ్వాక్రా మహిళలు ఈరోజు బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం మంజూరు చేసిన పసుపు కుంకుమ నిధులను బ్యాంకులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం యలమంద దగ్గర ఉన్న చైతన్య గ్రామీణ బ్యాంకు తమకు నగదు ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు. బ్యాంకు ముందున్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళలను సముదాయించారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపించివేశారు. మరోవైపు ప్రకాశం జిల్లాలోని కంభంలో కూడా బ్యాంకు అధికారులు ‘పసుపు-కుంకుమ’ నిధులు ఇవ్వడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పసుపు-కుంకుమ మూడో విడత నగదును ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే