amit shah: కేసీఆర్ లాంటి వాళ్లు పాకిస్థాన్ కు సమాధానం చెప్పగలరా?: అమిత్ షా
- తెలంగాణకు రూ. 2.35 లక్షల కోట్లు ఇచ్చాం
- ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు
- రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విమోచన కల్పించాలి
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్నారని... ఈ ఐదేళ్ల కాలంలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ. 2.35 లక్షల కోట్లను ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దేశం మొత్తం మోదీ, మోదీ అనే వినిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ కూడా చిన్నా చితకా పార్టీలను కలుపుకుపోతామని అంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ అని... టీఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరనేది ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు.
ఎంఐఎం అధినేత ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా కేసీఆర్ ఇంత వరకు జరపలేదని అమిత్ షా విమర్శించారు. రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని అన్నారు. పాక్ నుంచి ఒక్క బులెట్ వస్తే... వారిపై బులెట్ల వర్షం కురిపిస్తామని చెప్పారు. కేసీఆర్ లాంటి వారు పాకిస్థాన్ కు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. అక్రమంగా వలస వచ్చినవారిని, చొరబాటుదారులను దేశం నుంచి తరిమేస్తామని చెప్పారు.