Andhra Pradesh: తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు.. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా!: వైఎస్ జగన్
- ఈ వ్యవస్థలో మార్పు జరగాలి
- మరో రెండ్రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి
- ‘ఫ్యాన్’ గుర్తుకే ఓటెయ్యండి
‘అక్కా, అన్నా, ‘ఫ్యాన్’ గుర్తుకే ఓటెయ్యండి.. వైసీపీని గెలిపించండి’ అని వైసీపీ అధినేత జగన్ ప్రజలను కోరారు. తిరుపతిలో నిర్వహించిన చివరి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాజకీయాలు మారాలి, అబద్ధాలు పోవాలి, విశ్వసనీయత అన్న పదం రావాలి అని అన్నారు. ఈ వ్యవస్థలో మార్పు జరగాలి అంటే జగన్ ఒక్కడి వల్ల సాధ్యం కాదని, మరో రెండ్రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ మార్పు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలేనని అన్నారు.
ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రజలందరిని కోరుతున్నానని, తొమ్మిదేళ్లుగా ప్రజలు తనను చూస్తున్నారని, ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా అక్కడికి వెళ్లానని, వారి కోసం పోరాడానని అన్నారు. 'తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు కనుక, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా, ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని చెబుతున్నా'నని అన్నారు. నాయకుడికి ప్రజలు తప్ప మరో ధ్యాస ఉండకూడదని, అలాంటి గుణాలు ఉన్న వారు మన కర్మ కొద్దీ ఇప్పటి పాలకుల్లో లేరని విమర్శించారు. ఇలాంటి గుణాలున్న నాయకుడు మళ్లీ రావాలంటే మార్పు తీసుకొచ్చేందుకు ప్రజలు అందరూ సహకరించాలని, వైసీపీపై ప్రజల చల్లని దీవెనలు ఉంచాలని, తమ పార్టీకే ఓటు వేయాలని కోరారు.