Mahesh Babu: మహిళల అక్రమ రవాణా వ్యతిరేక పోరాటానికి మహేశ్ బాబు మద్దతు
- ఏఎంబీ సినిమాస్ లో షార్ట్ ఫిలింస్ ప్రదర్శన
- హాజరైన నమ్రత, యూఎస్ కాన్సులేట్ జనరల్ కాథరిన్ హడ్డా
- త్వరలో తెలుగు రాష్ట్రాల్లో 700 షోలు
టాలీవుడ్ హీరోల్లో సామాజిక చైతన్యం ఉన్న వాళ్లలో మహేశ్ బాబు ఒకరు. ఇప్పటికే శ్రీమంతుడు చిత్రం స్ఫూర్తిగా బుర్రిపాలెం, సిద్ధాపురం అనే గ్రామాలను దత్తత తీసుకున్న మహేశ్ బాబు అనేక మంది చిన్నారులకు హృద్రోగ శస్త్రచికిత్సలకు అవసరమైన సాయం అందించారు. తాజాగా, మహిళల అక్రమ రవాణా వ్యతిరేక సామాజిక కార్యక్రమాలకు మద్దతిచ్చే క్రమంలో తన ఏఎంబీ సినిమాస్ లో షార్ట్ ఫిలింస్ ప్రదర్శనకు అనుమతిచ్చారు. టాలీవుడ్ ఆర్ట్స్ కమ్యూనిటీ ఇటీవలే మహిళల అక్రమ రవాణా సమస్యపై కొన్ని లఘు చిత్రాలు రూపొందించింది. వాటిని తాజాగా ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ లో ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనకు మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత, హైదరాబాద్ లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కాథరిన్ హడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాథరిన్ హడ్డా మాట్లాడుతూ, మహేశ్ బాబుకు, నమ్రతకు కృతజ్ఞతలు తెలిపారు. "ఈ సామాజిక కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్న నా మిత్రులు మహేశ్, నమ్రతలకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. అంతేగాకుండా, ఎంతో ప్రతిభావంతులైన టాలీవుడ్ ఆర్ట్స్ కమ్యూనిటీ ప్రతినిధులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్లలో ఈ షార్ట్ ఫిలింస్ ప్రదర్శిస్తామని హడ్డా తెలిపారు.