Chandrababu: మీ తీరు దుర్మార్గం... ఈసీకి 8 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన చంద్రబాబు!
- కేవలం వైసీపీ ఫిర్యాదులపైనే చర్యలు
- టీడీపీ ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
- కేకే శర్మను వెంటనే తొలగించాలి
- చంద్రబాబునాయుడి డిమాండ్
ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఈసీ అధికారులను ఉద్దేశిస్తూ, ఆయన 8 పేజీల బహిరంగ లేఖను రాశారు. ఈసీ అధికారులు బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని తన లేఖలో ఆరోపించిన చంద్రబాబు, ఐటీ దాడులతో తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, పోలీసు పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న కేకే శర్మను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో కేకే శర్మను బెంగాల్ లో నియమిస్తే, తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేసిన చంద్రబాబు, ఆయన్ను అక్కడి నుంచి తెచ్చి ఏపీపై రుద్దారని ఆరోపించారు. తృణమూల్ ఎలాంటి ఆందోళన చేసిందో అది ఏపీకి కూడా వర్తిస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని పోలీసు పరిశీలకుడిగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న భావన కలుగుతోందని చంద్రబాబు తన లేఖలో అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని అన్నారు. అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించిన చంద్రబాబు, జరుగుతున్న దాడులతో పార్టీ కేడర్ నైతిక సామర్థ్యం దెబ్బతీస్తూ, ఇతర పార్టీలను ప్రోత్సహించేలా ఉందని మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఈసీని ప్రశ్నించారు. 66 మంది విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు ఇప్పటికే రాష్ట్రపతికి లేఖను రాశారని, దానిపై ఏం స్పందించారని నిలదీశారు. కేవలం ఏపీ వంటి రాష్ట్రాల్లోని అధికారులపైనే ఈసీ చర్యలు తీసుకుంటోందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘాన్ని అంతమంది మాజీ అధికారులు తప్పుపట్టడం దురదృష్టకరమని, ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ బదిలీ పోలీసు శాఖకే తప్పుడు సంకేతాలు పంపిందని అన్నారు.
ఇదే ఈసీ, ఫారమ్-7 పేరిట తప్పుడు దరఖాస్తులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబునాయుడు తన లేఖలో ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం అధికారులు వెంటనే స్పందిస్తున్నారని, నిజానిజాలు ఏంటన్న విషయాన్ని తెలుసుకోకుండానే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కనీసం అధికారులను వివరణ కూడా అడగటం లేదని, ప్రతిపక్ష నాయకుడి నిరాధార ఆరోపణలకు ప్రాధాన్యం ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. 31 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి పార్టీ చేసే ఆరోపణలపై వెంటనే స్పందిస్తున్న ఈసీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
వైఎస్ వివేకా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని వైసీపీ ప్రయత్నించిందని, కేసు విచారణ జరుగుతున్న సమయంలో అధికారులను మార్చేసిన ఈసీ, విచారణను నీరుగార్చిందని చంద్రబాబు ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా కేసు విచారణలో కీలక అధికారిగా ఉన్న వ్యక్తిని బదిలీ చేశారని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని మండిపడ్డారు.