Mamatha Banarjee: సభాస్థలిని గుర్తించలేక పైలట్ తికమక... దారితప్పిన మమతా బెనర్జీ హెలికాప్టర్
- బీహార్ లో అడుగుపెట్టిన హెలికాప్టర్
- కలర్డ్ స్మోక్ గన్ తో పైలట్ కు హెలిపాడ్ చూపించిన అధికారులు
- అరగంట ఆలస్యంగా సభకు చేరిక
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పడం అధికారులు, పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమైంది. మమతా బెనర్జీ ఇవాళ చొప్రా ప్రాంతంలో ఎన్నికల సభలో పాల్గొనడం కోసం సిలిగురి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరారు. నార్త్ దీనజ్ పూర్ ప్రాంతంలోని చొప్రా వద్ద మమత సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఎదురుచూస్తున్నారు. ఎంతసేపటికీ సీఎం రాకపోవడంతో అధికారుల్లో ఆందోళన పెరిగింది. ఏం జరిగిందని ఆరా తీస్తే, మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పి బీహార్ లో ప్రవేశించినట్టు తెలిసింది.
చొప్రాలో సభాస్థలిని గుర్తించడంలో పైలట్ విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మమతా బెనర్జీ సకాలంలో సభకు రాకపోవడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆ హెలికాప్టర్ ఎక్కడుందో గుర్తించడమే కాకుండా, చొప్రా చేరుకునేలా చర్యలు తీసుకున్నారు.
చొప్రా గగనతలంలోకి హెలికాప్టర్ ప్రవేశించిన అనంతరం, రంగు రంగుల పొగలు గాల్లోకి వదులుతూ హెలికాప్టర్ పైలట్ కు 'ఇదే సభాస్థలి హెలిపాడ్' అంటూ దిశానిర్దేశం చేశారు. దాంతో మమత ప్రయాణిస్తున్న ఆ హెలికాప్టర్ అరగంట ఆలస్యంగా చొప్రాలో ల్యాండైంది. సీఎం రాకతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.