Kajal Agarwal: 'పీఎం మోదీ' చిత్రానికి మద్దతుగా కాజల్ అగర్వాల్ ట్వీట్.. మండిపడుతున్న తమిళులు
- బీజేపీకి ప్రచారం చేస్తున్నావా? అంటూ ఫైర్
- కాజల్ సినిమాలపై నిషేధం విధించాలి
- తమిళనాడులో భగ్గుమంటున్న ప్రజలు, నేతలు
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై ట్విట్టర్ లో ఇప్పుడు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పీఎం మోదీ' చిత్రానికి మద్దతుగా ఆమె చేసిన ట్వీట్ దక్షిణాది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. 'పీఎం మోదీ' చిత్రంలో లీడ్ రోల్ పోషించిన వివేక్ ఓబెరాయ్ బయోపిక్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీనిపై కాజల్ స్పందిస్తూ, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఉత్సాహంగా ఉందంటూ పేర్కొంది. ఈ సినిమా సూపర్ హిట్టవుతుంది అంటూ బదులిచ్చింది.
దీనికి వివేక్ ఓబెరాయ్ కూడా స్పందిస్తూ కాజల్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఇదంతా గమనించిన తమిళ నెటిజన్లు వెంటనే రంగంలోకి దిగి కాజల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు. ప్రజలే కాదు, రాజకీయ పార్టీల నేతలు కూడా కాజల్ ట్వీట్ పై మండిపడుతున్నారు. కాజల్ సినిమాలు ఎవరూ చూడొద్దని, ఆమె నటించిన చిత్రాలపై తమిళనాడులో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.