Telangana: జనగామ జిల్లాలో కలకలం.. సమ్మక్క ఆలయంలో నరబలి?

  • సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద వ్యక్తి హత్య
  • మొండాన్ని సమీపంలోని రిజర్వాయర్‌లో పడేసిన వైనం
  • వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు

తెలంగాణలోని జనగామలో నరబలి వార్తలు కలకలం రేపాయి. చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించడం సంచలనం సృష్టించింది. సమ్మక్క-సారలమ్మ గద్దకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించడంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలు ఘటన జరిగిన ప్రాంతం నుంచి పలు ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి వయసు 45 వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం రాత్రి గద్దెల వద్ద అతడిని హత్యచేసి అనంతరం మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతుడి తల లభించలేదని, దాని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది కచ్చితంగా నరబలే అయి ఉంటుందని అనుమానిస్తున్నట్టు డీసీపీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  

మరోవైపు, మంగళవారం సాయంత్రం కొందరు వ్యక్తులు రెండు ఇన్నోవా కార్లలో రిజర్వాయర్ వద్దకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇది బయటి వ్యక్తుల పనేనని అనుమానిస్తున్నారు. అయితే, మృతుడి జేబులో గాజులు, లేడీస్ వాచ్ లభ్యమయ్యాయని, హత్యకు ముందు అతడి కాళ్లను చున్నీతో కట్టివేశారని చెబుతున్న పోలీసులు.. వివాహేతర సంబంధం కూడా కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News