Andhra Pradesh: ఏపీకి హెరిటేజ్ కంపెనీనే తీసుకురాలేని చంద్రబాబు.. వేరే పరిశ్రమలను తెస్తారా?: విజయసాయిరెడ్డి సెటైర్లు
- తెలంగాణలో రూ.15 వేల కోట్లతో హెరిటేజ్ విస్తరణ
- అదే యూనిట్ ఏపీలో పెడితే యువతకు ఉద్యోగాలు వచ్చేవి
- చంద్రబాబుపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిురెడ్డి ఈరోజు విరుచుకుపడ్డారు. చంద్రబాబు తెలంగాణలో రూ.15,000 కోట్లతో హెరిటేజ్ యూనిట్ విస్తరణను చేపట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
అదే యూనిట్ ను ఏపీలో పెట్టి ఉంటే వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేవని వ్యాఖ్యానించారు. తెల్లవారితే తెలంగాణపై విషం కక్కే చంద్రబాబు తన వ్యాపారాన్ని మాత్రం అక్కడే విస్తరిస్తున్నారని దుయ్యబట్టారు. హెరిటేజ్ సంస్థనే ఏపీకి తీసుకురాలేని వ్యక్తి వేరే పరిశ్రమలను తెస్తారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రబాబు రూ.15 వేల కోట్లతో తెలంగాణలో హెరిటేజ్ యూనిట్ విస్తరణను చేపట్టారు. అదే ఏపీలో పెట్టి ఉంటే వేలాది మంది యువతకు జాబ్స్ వచ్చేవి. తెల్లారిలేస్తే తెలంగాణపై విషం కక్కే బాబు తన వ్యాపారాన్ని మాత్రం అక్కడే విస్తరిస్తున్నారు. హెరిటేజ్నే ఏపీకి తేలేని వాడు. వేరే పరిశ్రమలను తెస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ కు ఓ వార్తాపత్రిక క్లిప్ ను జతచేశారు.