Telangana: ఓటరు చైతన్యం హైదరాబాద్‌లో ఏమైంది?.. అత్యల్పంగా 39.49 శాతం ఓటింగ్ నమోదు!
- 70 శాతం దాటిన నియోజకవర్గాలు ఐదే
- హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో అతి తక్కువ శాతం నమోదు
- 75.61 శాతంతో ఖమ్మం రికార్డు
గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో నమోదైన పోలింగ్ శాతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యావంతులు పెద్ద ఎత్తున ఉండే రాజధానిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 39.49 శాతం నమోదు కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగ్గా తమకు అందిన వివరాలను బట్టి 62.25 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇది 70.75 శాతం వుంది. దీనిని బట్టి చూస్తే ఓటరు చైతన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
తాజా ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా 75.61 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లో అతి తక్కువగా 39.49 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్‌లో 54.20 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 45 శాతం, మల్కాజిగిరిలో 42.75 శాతం, చేవెళ్లలో 53.80 శాతం, వరంగల్‌లో 60 శాతం, నాగర్ కర్నూలులో 62.51 శాతం, మహబూబాబాద్‌లో 65.30 శాతం, పెద్దపల్లిలో 65.22 శాతం, జహీరాబాద్‌లో 67.80 శాతం కరీంనగర్లో 69.40 శాతం పోలింగ్ నమోదైంది. 70 శాతానికి పైగా నమోదైన నియోజకవర్గాల్లో ఖమ్మం, భువనగిరి, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి.