CSK: ధోనీ చేసిన పనికి చాలా రోజులు ప్రశ్నిస్తూనే ఉంటారు: సీఎస్కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్
- విమర్శలకు దారితీసిన ధోనీ తీరు
- అంపైర్లు అయోమయంలో ఉన్నారనే ధోనీ వెళ్లాడు
- వివరణ ఇచ్చిన స్టీఫెన్ ఫ్లెమింగ్
నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన టీ-20 పోరులో ధోనీ ప్రవర్తించిన తీరు, అతనికి విమర్శలు తెచ్చిపెడుతోంది. ధోనీ తన సహజసిద్ధమైన సహనాన్ని పక్కనబెట్టి, డగౌట్ నుంచి మైదానంలోకి వెళ్లి అంపైర్లతో గొడవ పడిన సంగతి తెలిసిందే. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడగా, జరిగిన ఘటనపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.
ధోనీ చేసిన పనిపై చాలారోజుల పాటు, చాలాసార్లు ప్రశ్నిస్తూనే ఉంటారని అన్నాడు. బంతిని నోబాల్ గా ప్రకటించి, ఆపై కాదనడంతో వివరణ కోరేందుకు మాత్రమే వెళ్లాడని స్పష్టం చేశాడు. అంపైర్లతో చర్చించి, క్లారిటీ తీసుకునేందుకే ధోనీ వెళ్లాడని, అతను చేసింది సరైనదేనా? అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటారని అన్నాడు. అంపైర్లే అయోమయంలో ఉన్నారన్న ఉద్దేశంతోనే ధోనీ ఆగ్రహానికి గురయ్యాడని అన్నారు.
ఈ టోర్నీలో అంపైర్లు చేస్తున్న తప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డ ఫ్లెమింగ్, వారికి శిక్షలు ఉండవా? అని ప్రశ్నించారు. కాగా, ధోనీ చేసింది తప్పేనని, అతను అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.