ayodya ramjanmabhoomi: రామజన్మభూమి మందిర్ నిర్మాణ్ న్యాస్ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్నాథ్కు సుప్రీం చీవాట్లు
- దేశాన్ని ప్రశాంతంగా ఉండనీయండని సలహా
- అలహాబాద్ హైకోర్టు తీర్పును గౌరవించాలని ఆదేశం
- పూజలకు అనుమతించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రామజన్మభూమి మందిర్ నిర్మాణ్ న్యాస్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్నాథ్కు సుప్రీం కోర్టు సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది. కింది కోర్టు తీర్పును గౌరవించాలని ఆదేశించింది. అయోధ్యలో 67.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య-బాబ్రీమసీదు ప్రాంతంలో ఎటువంటి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని, అతిక్రమించిన వారికి రూ.5 లక్షల జరిమానా విధించాలని గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రామజన్మభూమి ప్రాంతంలో పూజలు నిర్వహించేందుకు అనుమతించాలని అమర్నాథ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిశీలించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దేశం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా?' అని మండిపడ్డారు. పిటిషన్ తిరస్కరిస్తూ అలహాబాద్ కోర్టు తీర్పును గౌరవించాలని సూచించారు. అయోధ్య వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం నెరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఇబ్రహీం నేతృత్వంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీరవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరావమ్ పంచుతతో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని గతనెలలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 3వ తేదీలోగా పరిష్కార మార్గాలు సూచించాలని ఈ బృందాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.