Andhra Pradesh: చంద్రబాబు తీరు చిన్నపిల్లలు కూడా అసహ్యించుకునేలా ఉంది!: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
- టీడీపీ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చింది
- దీంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు
- వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సజ్జల
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమయిందో తెలియదు కానీ పోలింగ్ కు ఒకరోజు ముందే హైడ్రామాకు తెరలేపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాను ప్రధాన పాత్రధారిగా చంద్రబాబు తానే డైరెక్షన్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ సర్వే అందిందని సజ్జల తెలిపారు.
దీంతో దాన్ని అడ్డుకునేందుకు, సానుభూతి పొందేందుకు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు కూర్చోవాలనీ, ఆ తర్వాత తనను లాక్కెళ్లాలని పోలీసులకు చంద్రబాబు సూచించారని ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు.
అయితే కొంచెం తెలివి ఉన్న పోలీస్ అధికారులు.. ‘సార్.. ఒకవేళ అలాచేస్తే ఈయనకు అడ్మినిస్ట్రేషన్ పైనే పట్టు పోయింది అని అందరూ చెప్పుకుంటారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ లెక్కచేయరు’ అని చెప్పారని, దీంతో ఆ ఆలోచనను చంద్రబాబు విరమించుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఈసీ దగ్గరకు వెళ్లి దబాయించారని విమర్శించారు. దానికి కంటిన్యూగా చంద్రబాబు పార్టనర్ కోడెల ఇనిమెట్లలో రాద్ధాంతం సృష్టించారన్నారు. కోడెల ఎపిసోడ్ తో కూడా టీడీపీకి సింపతీ రాలేదని స్పష్టం చేశారు.
2014లో జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందరూ నమ్మారని వ్యాఖ్యానించారు. కానీ ఓటర్ తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందనీ, అప్పుడు జగన్ ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ఫలితాలు వచ్చిన 10 నిమిషాలకే మీడియా ముందుకు వచ్చి ప్రజాతీర్పును స్వీకరిస్తున్నామని జగన్ చెప్పారన్నారు. ఓ పరిణతి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం అదేనన్నారు. కానీ 70 ఏళ్లు వచ్చిన మన 40 ఏళ్ల ఇండస్ట్రీ(చంద్రబాబు) తీరు చిన్నపిల్లలు కూడా అసహ్యించుకునేలా వుందని దుయ్యబట్టారు.