CPI: ఈసీ తీరు చూస్తుంటే కేంద్రం ఒత్తిడికి తలొగ్గినట్టు కనిపిస్తోంది: సురవరం
- ఈవీఎంలతో మోసాలకు తావులేదని నిరూపించాలి
- ప్రజాస్వామ్యంలో లోపరహిత ఎన్నికలు అవసరం
- వీవీ ప్యాట్ల అంశంలో మేం కేసు వేశాం
గతకొన్నాళ్లుగా దేశంలో ఈవీఎంల పనితీరు గురించి, వీవీ ప్యాట్ల గురించి చర్చ జరుగుతోంది. ఈవీఎంలను సులభంగా ప్రభావితం చేసే వీలుందన్న ఆరోపణల నేపథ్యంలో వీవీ ప్యాట్ల ద్వారా ఈవీఎంలకు విశ్వసనీయత వస్తుందని అనేక పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విషయంలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా, లోపరహితంగా జరగడం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు.
ఈవీఎంలతో మోసాలకు తావులేదని ప్రజల్లో నమ్మకం కలిగించాలని ఆయన సూచించారు. తాజా ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం అపనమ్మకాలకు కారణమవుతోందని అన్నారు. జరిగిన పరిణామాలు చూస్తుంటే కేంద్రం ఒత్తిడికి ఎన్నికల సంఘం లొంగిపోయినట్టుగా కనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. వీవీ ప్యాట్ల విషయంలో తాము కేసు వేశామని సురవరం చెప్పారు.