Sriramanavami: కిటకిటలాడుతున్న దేవాలయాలు, జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల బంద్!
- వేలాది దేవాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం
- భద్రాచలంలో ఏర్పాట్లు పూర్తి
- 18న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాది దేవాలయాల్లో శ్రీరామ కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలంలో మరికాసేపట్లో కల్యాణోత్సవం జరుగనుంది. కొన్ని ప్రాంతాల్లో శనివారం నాడే శ్రీరామనవమి పండగను నిర్వహించినప్పటికీ, అత్యధిక దేవాలయాల్లో నేడు ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక ఒంటిమిట్ట కోదండరామాలయంలో 18వ తేదీన నిండు పున్నమి వెలుగుల్లో సీతారాముల కల్యాణం జరగనుంది.
ఇదిలావుండగా, నేడు శ్రీరామ శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయనున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించింది. మరోవైపు శోభాయాత్ర సందర్భంగా లిబర్టీ, కోటి, హిమాయత్ నగర్, ఎంజే మార్కెట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.