srirama navami: భక్త జనసంద్రమైన భద్రాద్రి...రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు పోటెత్తిన భక్తులు
- సర్వాంగ సుందరంగా ముస్తాబైన ముత్యాల పందిరి
- రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం ఘట్టం
- బుధవారం నుంచే ప్రారంభమైన నవాహ్నిక ఉత్సవాలు
చారిత్రక పుణ్యక్షేత్రం, సీతారాములు కొలువుదీరిన భద్రాద్రి భక్త జనసంద్రమైంది. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ఉత్సవ ఏర్పాట్లు, మరోవైపు భద్రాద్రికి క్యూకట్టిన భక్తులతో భద్రాచలం కొత్తశోభను సంతరించుకుంది. కల్యాణోత్సవ ఏర్పాట్లలో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి నవాహ్నిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
తొలిరోజున ప్రత్యేక తీర్థ బిందెను గోదావరి నుంచి తీసుకువచ్చి అంకురారోపణం చేశారు. 11న ధ్వజపట మండల లేఖనం, 12న ధ్వజారోహణం, 13న ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణం జరిపించనున్నారు. రేపు స్వామి వారి పట్టాభిషేకం నిర్వహిస్తారు. కల్యాణోత్సవంలో భాగంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.