Jet Airways: "మీరు ఎంతిచ్చినా తీసుకుంటాం!"... స్పైస్ జెట్ బాటపడుతున్న జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు!
- పతనం దిశగా జెట్ ఎయిర్ వేస్
- జీతాల్లేక అల్లాడుతున్న ఉద్యోగులు
- తక్కువ జీతాలకే ఇతర సంస్థల్లో చేరిక
గత కొన్నాళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ పతనం అంచుల్లో నిలిచింది. ఒకప్పుడు రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు నడిపిన ఈ విమానయాన సంస్థ ఇప్పుడు పట్టుమని పది సర్వీసులు కూడా నడపలేక చతికిలపడింది. రుణభారం తీవ్రతరం కావడం, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పెరిగిపోవడం జెట్ ఎయిర్ వేస్ ను పాతాళానికి నెట్టివేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఇతర కంపెనీల బాటపడుతున్నారు.
ముఖ్యంగా, చవకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఉన్న ఉద్యోగంలో జీతాల్లేక ఇబ్బందులు పడడం కంటే ఇతర కంపెనీల్లో సగానికి సగం జీతం ఇచ్చినా ఫర్వాలేదని జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది భావిస్తున్నారు. వారి అవసరాన్ని పసిగట్టిన స్పైస్ జెట్ ఇదే అదనుగా తక్కువ జీతం ఇచ్చి వాళ్లలో మెరికల్లాంటివాళ్లను ఎగరేసుకెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో నెలకు లక్ష రూపాయలు తీసుకునే ఉద్యోగికి రూ.50 వేలు ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటోంది.
జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ స్పైస్ జెట్ తో పాటు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా, రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల మధ్యలో వేతనం చెల్లిస్తామని సదరు సంస్థలు బదులిచ్చాయి. వాస్తవానికి ఆ ఇంజినీర్ జెట్ ఎయిర్ వేస్ లో నెలకు రూ.4 లక్షల వేతనం అందుకునేవాడు. కానీ, జీతమే లేకుండా బతికే బదులు ఎంతోకొంత అనే ధోరణితో జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఇతర సంస్థల బాటపడుతున్నారు.