Andhra Pradesh: ముఖ్యమంత్రిగా జగన్ నేమ్ ప్లేట్.. తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రి దేవినేని ఉమ!
- చర్చను తప్పించుకునేందుకు ఈసీ కుంటిసాకులు
- పీకే బ్యాచ్ లాస్ట్ పేమెంట్ కోసం జగన్ ను భ్రమల్లో ఉంచుతోంది
- అమరావతిలో వైసీపీ అధినేతపై మండిపడ్డ ఏపీ మంత్రి
కేసు ఉందనే నెపంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను చర్చకు ఈసీ వద్దంటోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఈవీఎంలు ఎలా హ్యాక్ చేయవచ్చో చూపి, అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయసాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు.
ఈవీఎంలపై చర్చను తప్పించుకునేందుకు ఈసీ కుంటిసాకులు చెబుతోందని ఉమ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇటీవల 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రివర్యులు' అనే నేమ్ ప్లేట్ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై స్పందిస్తూ..’పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమల్లో ఉంచుతోంది. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ట’ అని మండిపడ్డారు.
పోలింగ్ ను ఏ విధంగా ఆలస్యం చేయవచ్చో ఈసీ ఏపీలో చేసి చూపిందని దుయ్యబట్టారు. టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎంలు పనిచేయలేదని ఆరోపించారు. అయినా ప్రజలు కసిగా ఓటింగ్ లో పాల్గొని బుద్ధి చెప్పారన్నారు.